ఫేస్‌మాస్క్.. మీ ఇంట్లోనే.. ట్రై చేయండి
ముఖ్యమైన ఫంక్షన్ లకు మాత్రమే పార్లర్ కి వెళ్ళడం ఇండియాలో మధ్యతరగతి ఆడవాళ్ళ అలవాటు.. నిజం చెప్పాలంటే ఇదే మంచి అలవాటు కూడా.. కానీ రెగ్యులర్ గా పార్లర్ కి వెళ్లకపోయినా శరీర సౌందర్యాన్ని, ముఖకాంతిని మాత్రం కాపాడుకోవడం తప్పనిసరి.. ఇందుకోసం పార్లర్ కి వెళ్ళవలసిన అవసరం లేదు.. ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే ఫేస్ మాస్క్‌లు వేసుకుని అందంగా మారొచ్చు.. మరి అందుకోసం ఏమేం చేయాలి. ఎలాంటి ఫేస్ మాస్క్స్ ట్రై చేయొచ్చు. తదితర అంశాలు ఈ కథనంలో నేర్చుకుందాం..
అందం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.. ఆత్మవిశ్వాసం జీవితంలో ఎదగడానికి సహాయపడుతుంది.. ఉన్నంతంలో అందంగా తయారవ్వడం ఎవరికైనా ఇష్టమే. సహజ అందం మోములో మరింత అందాన్ని తీసుకొస్తుంది. అలా సహజంగా అందంగా మెరిసిపోవాలనుకునే వారు కొన్ని టిప్స్ పాటించాలి. ఇంట్లో దొరికే అనేక వస్తువులని ఉపయోగించి మోస్ట్ గ్లామరస్‌గా కనిపించొచ్చు.. నలుగురిలో ప్రత్యేకంగా నిలువవచ్చు..
అందంగా కనిపించాలంటే కేవలం ఖరీదైన క్రీమ్స్ రాయాలని లేదు. సింపుల్ టిప్స్‌తో ఇంట్లోనే ఎంతో అందంగా తయారు కావొచ్చు. ఆ టిప్స్ గురించి తెలుసుకుందాం..
మొదటిగా అందరికీ తెలిసిన విషయం ఫేస్ వాష్.. ముఖానికి ఏదైనా రాయాలని అనుకున్నప్పుడు ఎలా పడితే అలా రాయొద్దు.. ముందుగా ముఖాన్ని మంచి ఫేస్ వాష్‌తో క్లీన్ చేయాలి. ఇది గోరువెచ్చని నీరు లేదా చల్లని నీటితో చేయాలి.
స్క్రబ్.. ఇది చాలా తేలికైన పద్ధతి
స్క్రబ్ కోసం ముందుగా కొద్దిగా తేనె అందులో సరిపడా చెక్కెర, నిమ్మరసం వేసి స్క్రబ్‌లా ముఖంపై రాయాలి. ఇలా రాయడం వల్ల చర్మంపైనున్న మృతకణాలు పోతాయి. అయితే గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు.. అందులోనే చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. అది స్క్రబ్‌లా పనిచేస్తుంది.
స్టీమింగ్.. ఇది అందరూ చేసేదే..
స్టీమింగ్ చేయాలంటే ఒక గిన్నెలో నీటిని వేడి చేసి ఆవిరిపట్టాలి. ఇప్పుడు స్క్వీజర్‌ని ఉపయోగించి ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ని మెల్లిగా తీయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై బ్లాక్, వైట్ హెడ్స్ పోయి క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోండి.. అద్భమైన మెరుపు లభిస్తుంది.
ఫేస్ ప్యాక్స్.. ఇవి రకరకాలుగా వేసుకోవచ్చు..
ఇది చర్మతత్వాన్ని అర్ధం చేసుకుని ఉపయోగించాలి.. ఈ చర్మానికి ఏది సూట్ అవుతుందని చూసుకుని వేసుకోవాలి. అయితే, కాస్మెటిక్స్‌తో పోలిస్తే సహజ సిద్ధంగా తయారు చేసుకున్న ప్యాక్స్‌తో అంతగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు.. అద్భుత ఫలితాలను పొందవచ్చు..
1) హనీ ప్యాక్.. మెత్తదనం కోసం.. తేనె చర్మంపై కాంతిని తీసుకొచ్చి మెత్తగా చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా ముఖంపై రాయడం వల్ల చక్కని ఫలితాలు ఉంటాయి. దీనిని ఏ ప్యాక్‌లో అయినా కలిపి వేసుకోవచ్చు. అలానే తేనెలో ఓ చెంచా నిమ్మరసం కలిపి ముఖంపై రాయండి. రాత్రంతా అలానే వదిలేయండి. ఉదయం లేవగానే చల్లని నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది.. ఇందులో ఏ ఇతర పదార్ధాలను అయినా కలుపవచ్చు..
2) చర్మం పొడిబారి ఇబ్బంది పెడుతుంటే.. గంధం పొడిలో పాలు కలిపి తేనె కలిపి ప్యాక్‌లా వేయాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం మెరుస్తుంటుంది. తేనె, పాలు ముఖానికి మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా వేసుకోవడం మంచిది.
3) ఓట్స్‌ని పొడి చేసి అందులో పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు మాయమై అందంగా మారుతుంది. రెగ్యులర్‌గా ఈ ప్యాక్ వేయడం చాలా మంచిది. ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
4) పూలరేకులు కూడా మీ ముఖంలో అందాన్ని తీసుకొచ్చేందుకు సాయపడతాయి. తీరిగ్గా ఉన్న సమయంలో ఏదైనా పూరేకులను అంటే గులాబీ, బంతిపూలు ఇలాంటి పూలను ఆరబెట్టండి. వీటిని పొడి చేసి పెట్టుకుండి. ఆ పొడులలో పాలు లేదా రోజ్ వాటర్, కలిపి రాయండి.. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగండి. ఇలా చేయడం వల్ల వచ్చే మార్పుని కొద్ది రోజుల్లోనే మీరు గమనిస్తారు.. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది..
5) పాల మీగడ, పసుపు, శనగపిండి ఈ ప్యాక్ చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. ఇలా తయారు చేసిన ప్యాక్‌ని ముఖంపై రాయండి.. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయండి.
6) పెరుగు, కాసింత బియ్యంపిండి కలిపి ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేయండి.
7) టమాట గుజ్జులో రోజ్ వాటర్, తేనె కలిపి రాయండి ఆరిన తర్వాత కడిగేయండి..
8) టమాటని ముక్కలా కోసి దానికి కాస్తా ఉప్పుని అద్ది ముఖంపై రుద్దండి. ఆ తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
9) బొప్పాయి.. ముఖంపై బొప్పాయి రాయడం వల్ల మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మంచిగా పండిన బొప్పాయిని తీసుకుని దాన్ని గుజ్జులా చేసి ముఖంపై రాయండి. ఆరిన తర్వాత కడిగేయండి.
ఇవే కాకుండా.. అరటి పండు, నారింజ పండ్లు, కీరా రసం వీటి కాంబినేషన్‌తో ప్యాక్ వేసుకుంటే చక్కని ఫలితాలు ఉంటాయి.
ప్యాక్ వేసుకునే పద్ధతి..
అయితే, ప్యాక్స్ మధ్యాహ్నాం ఉదయం వేసుకునే బదులు రాత్రి సమయాల్లో వేసుకుంటే అదనపు లాభాలు ఉంటాయి. ఎందుకంటే రాత్రి టైమ్‌లో మనం పడుకుంటాం.. ఎలాంటి పని చేయం అప్పుడు ఆ ప్యాక్‌లోని ప్రత్యేక గుణాలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ మరింత బాగుంటుంది.
ఫేస్ ప్యాక్ తర్వాత..
ఏ ఫేస్ ప్యాక్స్ వేసుకుని ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఆ తర్వాత మెత్తటి వస్త్రంతో ముఖంపై అద్దాలి. అనంతరం ఏదైనా మంచి మాయిశ్చరైజర్ లేదా ఏదైనా మీకు సరిపోయే ఆయిల్‌ని ముఖంపై వేసి కాసేపు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం పొడిగా మారకుండా ఉంటుంది.
ఇక్కడ ఓ విషయం చెప్పాలి. ఫేస్ ప్యాక్ అంటే ఇలానే వేయాలి. స్క్రబ్ 15 రోజులకు ఓసారి మాత్రం చేస్తే సరిపోతుంది. ప్యాక్ మాత్రం వారానికి ఓసారి ఇలా మీకు వీలున్నప్పుడు వేసుకోండి. అలానే స్టీమింగ్, బ్లాక్, వైట్ హెడ్స్ రిమూవింగ్ కూడా 15 రోజులకు ఓసారి చేయండి అంతేకానీ, రెగ్యులర్‌గా కాదు. ఎక్కువగా స్టీమింగ్ చేసినా ముఖం పొడి బారే అవకాశం ఉంటుంది.
కానీ 15 రోజులకు ఓసారి చెప్పిన పద్ధతిలో ఫేస్ ప్యాక్ వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అదే విధంగా ఎక్కువగా నీరు తాగండి. ఆనందంగా ఉండండి. మంచి నిద్ర, మంచి ఆహారంపు, మంచి ఆహారపు అలవాట్లు మీ ముఖ అందాన్ని మరింత పెంచుతాయి. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.
మొటిమల సమస్య ఉన్నవారు కూడా ఎక్కువగా వాటిని గిల్లడం, వాటిపైనే స్క్రబ్ చేయడం చేయొద్దు ఇలా చేయడం వల్ల సమస్య పెద్దది అవుతుంది. కానీ తగ్గదు.
మీ విలువైన అభిప్రాయాలను తెలియపరచండి..